నెలవంక

నెలవంక ఒక చూపులో
చరిత్ర: ఒక చిన్న చినుకు నీటిపాయగా, వాగుగా, వంకగా, నదిగా మారి మహా సముద్ర రూపం దాల్చినట్లు ‘కువైట్‌లో నివసిస్తున్న తెలుగు జనుల మధ్య సదవగాహనను, సంఘీభావాన్ని పెంపొందింపజేసేందుకు, తెలుగు కమ్యూనిటిలో పొడసూపే దురాచారాలు, దురలవాట్లను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ ప్రజల ఆలోచనలకు నిర్మాణాత్మక ఒరవడిని ఇచ్చేందుకు, ముఖ్యంగా యువతలో శీలనిర్మాణం కొరకు ప్రయ త్నించేందుకు, ప్రజా బాహుళ్యంలో దైవసమ్మతమయిన జీవన విధానం అంతర్వాహినిలా ప్రవహించే విధంగా పాటు పడేందుకు, తెలుగు భాషా వైశిష్ట్యాన్ని చాటి చెబుతూ, దాని వికాసం కోసం ఇదోధిక కృషి జరపాలన్న సదుద్దేశ్యంతో ఒక ఆలోచన మొగ్గ తొడిగింది. అదే నెలవంక మాస పత్రిక. ‘ఒక్కొక్క వ్యక్తి సమస్త శక్తి ధారవోసి కృషి చెయ్యాలి’ అన్నట్టే పత్రిక సంపాదకులు, రచయితలు, పాఠకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు….ప్రతి ఒక్కరూ అశేషపూర్వకమైన తోడ్పాటుతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ, సమాజ హితానికి పెద్ద పీట వేస్తూ, సత్యం కోసం సతతం శ్రమించే సత్యప్రియులకు, హర్షించే పాఠకులకు సరైన వేెదికను సమకూర్చి, వారిని దాసుల దాస్యం నుండి వెలికి తీసి దైవ దాస్యం వనాల్లో విహరింప జేయడమే, వారిని కటిక చీకట్ల నుండి తీసి వెలుగు వెన్నెల్లో తడి స్నానాలు చేసేలా తిర్చిదిద్దడమే నెలవంక ముఖ్య ఆశయం. నవంబరు 2004 – రమజాను మాసపు శుభఘడియల్లో ముఖ్యంగా ముగ్గురు వ్యక్తుల అవిరళ కృషి, అవిశ్రాంత శ్రమతో ప్రారంభ మయిన ఈ మాస పత్రిక తర్వాత – తమిళ, ఫిలిప్ఫీనీ, మళయాలం, ఉర్దూ, బెంగాలీ, సింహాళి భాషల్లో ఆరు మాస పత్రికలు వెలువడటానికి ప్రేరణగా, తలకట్టుగా నిలిచింది. ప్రవాసాంధ్రులకు, అనురాగ గొపురం, విశ్వాసుల మాతలు, ఇస్లాం మరియు సైకాలజీ, పవిత్ర జీవితం, అనురాగ రావం, ఇస్లాం శిక్షణ, పూ పరిమళం, జ్ఞానామృతం, కవితా కుసుమాలు అను శీర్షికలు, ఉపశీర్షికలతోపాటు సాంస్కృతిక పోటీలు, కార్యక్రలమాల సమాచారం, ఖుర్‌ఆన్‌ పోటీలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు, దేశాభిమాన వ్యాసాలతో నెలవంక శోభాయమానంగా అలరారింది. కాలం సాగుతున్నకొద్దీ, కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ప్రపంచ వ్యాప్తంగా ఎందరో పాఠకులను, అభిమా నులను కూడగట్టుకుంటూ నెలవంక నిరంతరము ఎదుగుతూనే ఉంది. అలా నెలవంక ఈ ఎనిమిదేళ్ళలో తనదైన కొత్త శైలికి నాంది పలికింది.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ ఎదుగుదలకు మార్గదర్శకత్వం చేసిన మూల స్థభాల్లో శ్రీ ముహమ్మద్‌ అజీజుర్రహ్మాన్‌, సోదరులు రాషిద్‌ ఫారూక్‌, మౌలానా ముజాహిద్‌ ఖాన్‌ ఉమ్రీ ప్రముఖులు. నెలవంకకు కొత్త రూపురేఖలు ఇవ్వడంలోనూ, నెలవంకకు సంపాదకునిగా బాధ్యతలు నిర్వహించడంలోనూ శ్రీ ముహమ్మద్‌ అజీజుర్రహ్మాన్‌ గారి కృషి అనితరసాధ్యం.

లక్ష్యం: గల్ఫ్‌ దేశాల్లో అచ్చమైన తెలుగులో, స్వచ్ఛమయి ఆకృతితో వెలువడే తొలి మాస పత్రిక ఘనత నెలవంకకే దక్కింది. 2004 నవంబరు మాసంలో శ్రీ ముహమ్మద్‌ అజీజుర్రహ్మాన్‌ గారు గౌరవ సంపాదకులుగా, సోదరులు రాషిద్‌ ఫారూఖ్‌ సాంకేతిక దిశా నిర్దేశంతో, మౌలానా ముజాహిద్‌ ఉమ్రీ సహాయకులుగా తొలి సంచిక వెలువడింది. ఈ పత్రిక ప్రతిపాదన వెనుక రెండు ముఖ్య కారణాలున్నాయి. ఒకటి: సర్వ జనామోదం పొందేలా పత్రికను ప్రామాణికంగా, పుత్తడి బొమ్మలా తీర్చిద్దిడంతోపాటు, కువైట్‌లోని తెలుగు భాషాభిమానుల శిబిరాలలో ఇదో ఉత్తమ సాంస్కృతిక వారధిగా అలరారాలన్నది. స్వార్థ చింతన, లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకు, వర్గాలకు అతీతంగా, రచయితల కూ, పాఠకులకూ స్నేహపూతరిత వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా, హితైష్ణిగా మనగలగడం. రెండవది: పలు మత వర్గాలతో సమన్వ యాన్ని సాధించి, ఆయా సుముదాయాల, సమాజాలలో తిష్ఠవేసిన ఆధ్యాత్మిక, సామాజిక రుగ్మతలను, దురాచారాలను రూపుమాపి, అపా ర్థాలను దూరం చేసి, సరైన మార్గదర్శకత్వం ద్వారా వారిలో ధార్మిక, సామాజిక చైతన్యాన్ని రగుల్గొల్పి, వారిలోని సత్యార్తి తీర్చి, సత్య స్ఫూర్తితో ఇహపరాల సాఫల్యానికి మార్గం సుగమం చేయడం.
ఘనత: చివరికి ఈ క్రెడిట్‌, ఘనత మొత్తం ఐపిసి ధార్మిక సంస్థకే చెందుతుంది. ఐపిసి, ఐపిసి వంటి సమాజ హితాన్ని కొరే సంస్థలు ఎంతగానైతే సంఘంలో వర్ధిల్లుతాయో, అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, అధర్మాలు అంతగానే నిర్మూలించబడతాయి. కారుణ్య ప్రభువైన అల్లాహ్‌ా వారి ఈ చిరు కృషిని స్వీకరించి, దీని ద్వారా తెలుగు పాఠక లోకానికి ఇతోధిక ప్రయోజనం చేకూర్చాలని ప్రార్థిస్తున్నాము.

అభిలాష: మనం ప్రస్తుతం ఒక ఎల్లలు లేని ప్రపంచంలో ఉన్నాము. మన అనుభవాలు, అభిప్ర్రాయాలు పెనువేగంతో మన చుట్టూ ఉన్న ప్రపంచంతోపాటు మారిపోతున్నాయి. ఈ మార్పులన్నింటిని ప్రతిఫలించగలిగే సాధనాలో సాహిత్యం ప్రధానమయినది. హితైష్ణ సాహిత్య సృష్టికి తోడ్పడగల్గటం, సహేతుకమైన సాహిత్యాన్ని అందించడం ఏ ఒక్క పత్రిక మాత్రమే చేయగలిగే పని కాదు. ఇందుకు అనేక పత్రికల అవసరం ఉంది. గత కొన్నెళ్ళుగా అనేక ప్రతికలు తమకంటూ కొన్ని సాహితీ, ధార్మిక లక్ష్యాలు ఏర్పరచుకుని పరిశ్రమిస్తున్నాయి. అలా ఇస్లామీయ సాహిత్యాన్ని తెలుగు లోకానికి అందజేయడంలో తన 25 సంవత్సరాల అశేష సేవతో అగ్రభాగాన గీటురాయి వార పత్రిక ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరికి, వీరిలా మరికొన్ని పత్రికలు వెలువరించాలన్న సదుద్దేశ్యంతో ఉన్నవారికి మా హృదయపూర్వక అభినంద లతోపాటు వారికి మా సహాయసహకారాలు సదా ఉంటాయని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాము.
విన్నపం: పత్రిక నిర్వహకులకు కావలసింది, కేవలం అర్హత, తీరిక మాత్రమే కాదు. అంతకంటే అవసరమైనవి ఉన్నాయి. ఆసక్తి, ఉల్లాసం, అంకిత భావం, స్పష్టమయిన దృక్పథం, నిస్వార్థ సేవ, చిత్తశుద్ధి, త్యాగనిరతి, న్యాయశీలత, సచ్చీలత వంటి సద్గుణాలు. ఇవే ఏ పత్రిక ప్రగతి కయినా పట్టుకొమ్మలు. పై పేర్కొన్న వాటన్నింటితోపాటు ప్రజల ప్రోత్సాహం, శ్రేయోభిలాషుల దీవెలే ప్రస్తుతం నెలవంకను నడుపుతున్న ధనమూ, ఇందనమూ. కాబట్టి నెలవంక మరింత ఎదిగేందుకు పనికొచ్చే మీ సహాయసహకారాలు, మీ విలువైన సూచనల కోసం నిరీక్షిస్తూ……….. పాఠకులందరికీ రమజాన్‌ శుభాకాంక్షల్ని తెలిజేస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *